ఎయిర్ ఇండియా విమానంలో నల్లుల బాధ!

వాస్తవం ప్రతినిధి:  ప్రభుత్వ విమాయాన సంస్థ ఎయిరిండియాకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఆ సంస్థకు చెందిన విమానంలో నల్లులు ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయట.  దీనితో ఆ విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తుంది. వివరాలలో కి వెళితే…….మంగళవారం అమెరికాలోని నీవార్క్‌‌ నుంచి ముంబయి వచ్చిన విమానంలోని సీట్లలో నల్లులు ఉన్నాయని,అవి చాలా ఇబ్బంది పెట్టినట్లు కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. అది కూడా బిజినెస్‌ క్లాస్‌లో కూడా అదే పరిస్థితి ఏర్పడినట్లు ఫిర్యాదు అందడం తో అధికారులు తాత్కాలికంగా విమానాలను నిలిపివేశారు. అయితే విమానంలో నల్లులు కనిపించడంపై విమాన సిబ్బంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఒక ప్రయాణికుడు ఎయిర్ ఇండియా కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసి, సంస్థ సేవలు చాలా దారుణంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేయడం తో ఇప్పుడు ఈ వ్యవహారం పై అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. గురువారం ఇలాంటిదే మరో ఘటన జరిగింది. ముంబయి నుంచి నీవార్క్‌ వెళ్లిన ఎయిరిండియా విమానంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఓ పసికందును నల్లులు కుట్టాయి. ఈ ఘటనలపై ఎయిరిండియా స్పందించింది. ప్రవీణ్‌ అనే ప్రయాణికుడికి ఎయిరిండియా క్షమాపణలు చెప్పింది. నిర్వహణ సిబ్బందికి చెప్పి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కీటకాలు ఉన్నట్లు ఫిర్యాదులు అందుకున్న రెండు విమానాలను ఒక రోజు పాటు నిలిపేసి వాటిని శుభ్రంచేసి క్రిమిసంహారకాలు స్పే చేశామని, సీటు కవర్లు మార్చామని విమానయాన సంస్థ అధికారి ఒకరు చెప్పారు. ముంబయి-నీవార్క్‌ విమాన సమయంలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.