ఆసియా గేమ్స్ లో భారత్ కు స్వర్ణం: మోనూ గోయత్

వాస్తవం ప్రతినిధి: భారత కబడ్డీ క్రీడాకారుడు మోనూ గోయత్ ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేషియాలో ఆసియా గేమ్స్‌ జరగనున్ననేపథ్యంలో మోనూ మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ప్రొకబడ్డీ లీగ్‌ కోసం నిర్వహించిన వేలంలో మోనుగోయత్‌ రికార్డు స్థాయిలో రూ.1.51కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.  ‘ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధిస్తాం. వందశాతం గ్యారంటీ. కబడ్డీలో భారత విజయపరంపరను అక్కడే కొనసాగించి బంగారు పతకం కైవసం చేసుకుంటాం’అని ధీమా వ్యక్తం చేశాడు. ‘కొరియా, ఇరాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి కొంత పోటీ ఎదురుకావొచ్చు. మొన్న దుబాయ్‌లో జరిగిన కబడ్డీ మాస్టర్స్‌ ఫైనల్లో ఇరాన్‌ను ఓడించి కప్పు గెలిచాం. ఇరాన్‌ ఆటగాళ్లు మనలా ఆడుతున్నారు. అందుకే మనకు పోటీ ఇస్తున్నారు. ప్రొకబడ్డీ లీగ్‌ వల్ల ఇరాన్‌ ఆటగాళ్లు భారత్ ఆటగాళ్లతో ఆడే అవకాశం దొరకుతోంది. అందుకే వారు మనకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం మా సాధన బాగానే జరుగుతోంది. మన జట్టులో మంచి రైడర్స్‌ ఉన్నారు. అలాగే డిఫెన్స్‌లో కూడా బలంగా ఉన్నాం. ఇవన్నీ కలిసొచ్చే అంశాలు’ అని ధీమా వ్యక్తం చేశాడు.