ముందస్తు ఎన్నికలకు ప్రతిపక్షాలు సిద్ధమా ?: కేసీఆర్‌

వాస్తవం ప్రతినిధి: చంద్రబాబు పాలనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ టీఆర్‌ఎస్‌లో చేరిక సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన కేసీఆర్‌…. నాలుగేళ్లలో తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందంటే అందుకు తాము నిజాయితీగా పనిచేయడమే కారణమన్నారు.కుంభకోణాలు చేయకుండా, అవినీతికి పాల్పడకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు పనిచేయబట్టే ముందుకు వెళ్లగలిగామన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలన ఎలా ఉందో వివరించారు కేసీఆర్.‘‘నాలుగేళ్ల నుంచి ఏపీలో జరుగుతున్నదేంటో మనం చూడట్లేదా, డుమ్కీలు కొట్టడం తప్ప అక్కడ పని జరగట్లేదు. మాకంటే పెద్ద ఎవడూలేడన్న స్థాయిలో ఏదేదో చేస్తామని అక్కడి పాలకులు అన్నారు. ఇప్పుడేమైంది?.కేవలం మాటలు చెప్పుకుంటూ పోతే అయ్యేదేమీలేదని రుజువైంది. ఏపీకి భిన్నంగా తెలంగాణలో నాయకులందరం కష్టపడి పనిచేశాం కాబట్టే…. మంచి ఫలితాలు, అభివృద్ధి సాధించాం’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ సిద్దంగా ఉందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌కు 100కు పైగానే సీట్లు వస్తాయని సర్వేలో తేలిందన్నారు. సర్వేను చూసి తానే ఆశ్చర్యపోయానన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు.ఇందుకు ప్రతిపక్షాలు సిద్ధమా అని కేసీఆర్ సవాల్ చేశారు. తమ పార్టీ నేతలు కూడా జనం టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు…. ముందస్తు ఎన్నికలకు వెళ్దామంటున్నారని కేసీఆర్‌ చెప్పారు. ప్రతిపక్షాలు సిద్ధమంటే ముందస్తు ఎన్నికలకు తాము సిద్దమన్నారు.