బషీరా బాద్ లో దారుణ సంఘటన….చిన్నారి పై పైశాచికత్వం చూపిన అంగన్ వాడీ టీచర్

వాస్తవం ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తల్లి,తండ్రి,గురువు,దైవం అంటారు. అంటే తల్లి తండ్రి తరువాత స్థానం గురువుకే ఉంటుంది. అలాంటి గురువులు ఇప్పుడు పిల్లల పై పైశాచికత్వం చూపించడం అందరినీ కలవరానికి గురిచేస్తుంది. అమ్మలా చూసుకోవాల్సిన అంగన్‌వాడీ టీచర్ చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించిన ఘటన తాజా గా వెలుగులోకి వచ్చింది. అంగన్ వాడీ కేంద్రం నుంచి బయటకు పోతుందని బుగ్గలపై అగ్గిపుల్లలతో కాల్చింది. ఈ సంఘటన మైల్వార్ పంచాయతీ కంసాన్‌పల్లి(బి) గ్రామంలో జరిగింది. ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పొద్దని చిన్నారి తల్లిదండ్రులను అంగన్‌వాడీ టీచర్ బతిమిలాడగా.. చివరికి గ్రామస్తులకు తెలియడంతో విషయం బయటకు తెలిసింది. వివరాల్లోకి వెళితే…..కంసాన్‌పల్లి (బి) గ్రామానికి చెందిన శ్యామప్ప, మమతల కూతురు శ్రీవర్ష గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్నది. శ్రీవర్ష తిరిగి కేంద్రం నుంచి బయటకు పోతుండడంతో అంగన్‌వాడీ టీచర్ శీలా దేవికి కోపం వచ్చింది. దీనితో చిన్నారిని కేంద్రంలోకి తీసుకెళ్లి తలుపులు మూసి బుగ్గలపై అగ్గిపుల్లలను వెలిగించి మూడుచోట్ల కాల్చిందని తల్లి మమత పేర్కొంది. ఈ విషయాన్ని చిన్నారి శ్రీవర్ష ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చి చెప్పిందన్నారు. చిన్నారి బుగ్గలపై కాల్చిన విషయం అంగన్‌వాడీ టీచర్‌ను ప్రశ్నించగా తనకేమీ తెలియదని బుకాయించిందని, తర్వాత ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయగా అప్పుడు అసలు విషయం బయటపెట్టింది అని చిన్నారి తల్లి దండ్రులు తెలిపారు. ఒక్క నా కూతురిని అనే కాదు అందరి చిన్నారుల విషయంలో టీచర్ ఇలాగే వ్యవహరిస్తున్నదని ఆ చిన్నారి తల్లి చెప్పింది. అంగన్‌వాడీ టీచర్ మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటారని స్థానికులు కూడా చెబుతున్నారు. మరి ఇలాంటి పైశాచికత్వం చూపించిన ఆ అంగన్ వాడీ టీచర్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది మాత్రం తెలియరాలేదు.