పాక్ ఎన్నికల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థలు

వాస్తవం ప్రతినిధి:  పాకిస్థాన్ ఎన్నికల ప్రక్రియలోని లొసుగుల ఆసరాగా నిషేధిత ఉగ్రవాద సంస్థలు బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. 2008లో ముంబై మారణకాండ ప్రధాన సూత్రధారి, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ ఇటీవల ఒక పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీకి అక్కడి ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వక పోవడం తో సయూద్ ఈ సారి ఎన్నికల్లో పార్టీ ని పెట్టలేకపోయాడు. అయితే రాజకీయ ముసుగు, అతడి కనుసన్నలలో నడిచే మిల్లి ముస్లింలీగ్ (ఎంఎంఎల్) పార్టీ తరఫున పలువురు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. వీరిలో హఫీజ్ సయీద్ కొడుకు, అల్లుడు ఉండడం విశేషం. ఎంఎంఎల్‌కు గుర్తింపు లేక అల్లాహో అక్బర్ తెహ్రీక్(ఏఏటీ) పార్టీ నేతృత్వంలోని కూటమిలో భాగస్వామిగా చేరింది. ఒక స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ హుస్సేన్ షేక్ తన ఆస్తుల్ని రూ.40 వేలకోట్లుగా ప్రకటించి.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. జూలైలో జరిగే ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నట్లు పాక్ అవామీ తెహ్రీక్ చీఫ్, మతగురువు తహిరుల్ ఖాద్రీ చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అవినీతిపరులు, వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి వ్యతిరేకంగా ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.