టర్కీ దేశాధ్యక్షుడి గా మరోసారి ఎర్దగోన్

వాస్తవం ప్రతినిధి:  టర్కీ దేశాధ్యక్షుడిగా మరోసారి రిసైప్ తయ్యిప్ ఎర్డగోన్ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో ఆయన మరోసారి విజయాన్ని నమోదు చేశారు. ఎర్డగోన్‌కు 53 శాతం ఓట్లు పోలవ్వడం తో స్పష్టమైన మెజారిటీ వచ్చిందని ఎన్నికల అధికారి సాది గువెన్ తెలిపారు. ఆయన సమీప ప్రత్యర్థి ముహెర్రమ్ ఇన్సీకు 31 శాతం ఓట్లు పోలయ్యాయి. ఫలితం ఏదైనా ప్రభుత్వంపై తమ పోరాటం తప్పదని ప్రతిపక్ష నేతలు అన్నారు. దేశాధ్యక్షుడిగా ఎర్డగోన్ ఎన్నిక కావడం ఇది రెండవసారి అయినా.. కొత్త నియమావళి ప్రకారం ఆయన ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. మొత్తం 87 శాతం మంది ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అందులో ఇప్పటి వరకు 95 శాతం ఓట్ల కౌంటింగ్ జరిగింది. ఏప్రిల్ 2017లో జరిగిన రాజ్యాంగ సవరణ తర్వాత తొలిసారి దేశాధ్యక్ష ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సవరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే తాజా విక్టరీతో ఎర్డగోన్ ఈసారి మరిన్ని సంస్కరణలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.