ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం: పవన్ కళ్యాణ్

వాస్తవం ప్రతినిధి: ఇపుడు ఉక్కు పరిశ్రమ కోసం హడావుడి చేస్తున్న టీడీపీ నేతలే ఒకప్పుడు దాన్ని అడ్డుకున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అన్నారు.
ఇప్పుడు ఉక్కు పరిశ్రమ కోసం గోల చేస్తున్న టీడీపీ నేతలే ఒకప్పుడు దాన్ని అడ్డుకున్నారు. తమకి లబ్ది చేకూరదనే ఉద్దేశంతో దాన్ని అడ్డుకున్న నేతలు ఇపుడు లబ్ది చేకూరితే పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమే అంటున్నారు. జిందాల్ సంస్థ తాము ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమని నాతో చెప్పింది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు..దిగజారిపోయిన పరిస్థితి.పర్సెంటేజీలు ఇస్తేనే పరిశ్రమల ఏర్పాటు అవుతుందని విదేశాల్లో కొందరు పారిశ్రామిక వేత్తలు చెప్పారు. అదే జరిగితే నిరుద్యోగం పెరిగి ప్రాంతీయ అసమానతలు వస్తాయి. అని పవన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదని పవన్ అన్నారు. ప్రజలకు క్లీన్ గవర్నెన్స్ వస్తుందని టీడీపీకి మద్దతు ఇచ్చా అది జరగక పోవటంతో విభేదించానని పవన్ కళ్యాణ్ తెలిపారు. బీజేపీ కూడా విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టే బయటకు వచ్చామన్నారు. తమతో ఎవరు కలిసి వస్తే వాళ్ళతో వెళతామని పవన్ వెల్లడించారు. వామపక్షాలవి తనవీ ఒకే ఆలోచన అని పేర్కొన్నారు. మూడు నెలల్లో ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ వెల్లడించారు.