అర్చరీ ప్రపంచకప్ లో స్వర్ణం సాధించిన దీపిక కుమారి

వాస్తవం ప్రతినిధి: ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు తమ సత్తా చాటుతున్నారు. మహిళల సింగిల్స్‌ రికర్వ్‌ విభాగంలో భారత్‌కు చెందిన దీపిక కుమారి స్వర్ణం సాధించింది. ప్రపంచకప్‌లో దీపికకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. జర్మనీ క్రీడాకారిణి మిచెల్లి క్రాప్పన్‌పై 7-3తో విజయం సాధించి దీపిక బంగారు పతకం సొంతం చేసుకోవడం తో అక్టోబరులో టర్కీలో జరిగే ప్రపంచకప్‌ ఫైనల్‌ పోటీలకు అర్హత సాధించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ… ‘ఎట్టకేలకు.. నేను అనుకున్నది సాధించా. బంగారు పతకం సొంతం చేసుకున్నా. నవంబరులో టర్కీలో జరిగే ప్రపంచకప్‌ ఫైనల్‌కు అర్హత సాధించానా లేదా అన్న దాని గురించి ఆలోచించను. నా ఆటను నేను ఆస్వాదిస్తూ, ఎంజాయ్‌ చేస్తూ ఆడటం మాత్రమే నాకు తెలుసు. గెలుపోటముల గురించి పట్టించుకోను’ అని దీపిక తెలిపింది. 2011, 2012, 2013, 2015లో ప్రపంచకప్‌లో పాల్గొన్న దీపిక రజత పతకాల తో సరిపెట్టుకుంది. అయితే ఈ సారి మాత్రం స్వర్ణం సాదించి సగర్వంగా భారత్ కు రానుంది. ఇదే టోర్నీలో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ- జ్యోతి సురేఖ జోడీ కాంస్యం దక్కించుకున్న సంగతి తెలిసిందే.