కేజ్రీ కి మద్దతు తెలిపిన శివసేన నేత

వాస్తవం ప్రతినిధి: లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో ధర్నాకు దిగిన ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు శివ సేన నేత కూడా మద్దతు తెలిపారు. కేజ్రీవాల్‌ ఆందోళన విలక్షణమైనదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఐఏఎస్‌ల ఆందోళన నివారించాలని డిమాండ్‌ చేస్తూ ఎల్జీ కార్యాలయంలో కేజ్రీవాల్‌, ఆయన క్యాబినెట్‌ మంత్రులు గత వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఢిల్లీ అభివృద్ధికి పనిచేసేందుకు ఎన్నికైన ప్రజా ప్రభుత్వ సారథిగా కేజ్రీవాల్‌కు ఆ హక్కుందని, ఆందోళన బాట పట్టిన ఆప్‌ నేతలకు ఏమైనా జరిగితే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని శివసేన నేత సంజయ్ హెచ్చరించారు. అలానే శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ థాక్రే కేజ్రీవాల్‌తో సంప్రదింపులు జరిపారని చెప్పారు. మరోవైపు ఎల్జీ కార్యాలయంలో ధర్నా చేస్తున్న కేజ్రీవాల్‌ బృందానికి ఢిల్లీ హైకోర్టు షాకివ్వడం తో కోర్టు ఉత్తర్వులు, ఆందోళన తదుపరి వ్యూహాలపై చర్చించేందుకు కేజ్రీవాల్‌ నివాసంలో ఆప్‌ నేతల భేటీ జరగనున్నట్లు తెలుస్తుంది.