లైబీరియా అంతర్యుద్దం లోవందలాది మందిని పొట్టన పెట్టుకున్నాడు

వాస్తవం ప్రతినిధి: లైబీరియా అంతర్యుద్దం లో వందలాది మందిని పొట్టన పెట్టుకున్న నర హంతకుడిని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. లైబీరియా అంతర్యుద్ధంలో వందలాది మందిని పొట్టనపెట్టుకుని అమెరికాకు పారిపోయివచ్చిన ఓ నర హంతకుడు కమాండర్‌ మొహమ్మద్‌ జబ్బతెహ్‌(51). అతడి గతం గురించి అధికారులు ఆరా తీయగా ఎన్నో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈ కేసు విచారణ సందర్భంగా అతని బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలు విన్న న్యాయమూర్తులు సైతం విస్తుపోయారు. లైబీరియా నుంచి విచారణకు హాజరైన ఓ మహిళ(60) జడ్జీల ముందు వాంగ్మూలమిస్తూ.. ‘జంగిల్‌ జబ్బాగా పేరుగాంచిన మొహమ్మద్‌ జబ్బతెహ్, అతని సైనికులు మా ఊరిపై 1991లో దాడిచేశారు. నా భర్తతో పాటు, మరిది గుండెల్ని పెకలించి హత్యచేశారు. తర్వాత తినేందుకు వీలుగా ఆ గుండెలను వండాలని ఆదేశించారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘ధైర్యం తెచ్చుకో. వెంటనే మంట రాజేసి ఆ గుండెల్ని వండకుంటే జబ్బతెహ్‌ నీతో పాటు నన్నూ చంపేస్తాడు’ ఆ దళ సభ్యుడు ఒకరు తనతో చెప్పాడని ఆ మహిళ పేర్కొన్నారు. ఈ విధంగా అతడు చేసిన ఎన్నో ఆరాచకాలు ఒక్కొక్కటిగా బయటకి వచ్చాయి. దీనితో ఒక తీవ్రవాద సంస్థ కు చెందిన జబ్బతెహ్ అత్యంత కిరాతకుడిగా ముద్రపడ్డాడు. 1991–98 మధ్య చెలరేగిన అంతర్యుద్ధంలో అతని సైనికులు వందలాది మందిని ఊచకోత కోశారు. చిన్నారులను సైనికులుగా మార్చడం, హత్యలు, బహిరంగ అత్యాచారాలు వంటి అకృత్యాలకు పాల్పడ్డారు. అనంతరం 1998లో అమెరికాకు శరణార్థిగా పారిపోయిన జబ్బతెహ్‌.. అక్కడే వివాహం చేసుకుని ఫిలడెల్ఫియాలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. అయితే అమెరికాలో ప్రవేశించేముందు తన నేర చరిత్రను జబ్బతెహ్‌ అధికారులకు వెల్లడించలేదు.