బ్యాట్మింటన్ కోచ్ గోపీ చంద్ కి ఘన స్వాగతం

వాస్తవం ప్రతినిధి: కామన్వెల్త్‌ క్రీడల కోసం వెళ్లి గోల్డ్‌ కోస్ట్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు ఘనస్వాగతం లభించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ అంచనాలు అందుకుంటూ అద్వితీయంగా రాణించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గోపీ చంద్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఇక ఈ కామన్వెల్త్ క్రీడల్లో గోపీచంద్‌ శిక్షణలో రాటుదేలిన బ్యాడ్మింటన్‌ బృందం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మిక్స్‌డ్‌ టీం విభాగంలో పసిడితో బోణీ చేసిన షట్లర్లు.. పురుషుల, మహిళల సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సత్తా చాటారు. మహిళల సింగిల్స్‌లో స్వర్ణం, రజతం మన చేతికే దక్కడం విశేషం. అలానే పురుషుల హోరాహోరీ సింగిల్స్‌ ఫైనల్లో ఓడిన ప్రపంచ నంబర్‌వన్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ రజతం గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ రజతం దక్కించుకోగా.. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని జంట కాంస్యంతో సంతృప్తి చెందింది.