‘గాలి’ సోదరుడు సోమశేఖరరెడ్డికి బళ్లారి టికెట్

వాస్తవం ప్రతినిధి: కన్నడనాట అసెంబ్లీ ఎన్నికల సమరానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు తమ పార్టీ అభ్యర్థులందరి పేర్లను ప్రకటించగా.. తాజాగా అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది.అక్రమంగా ఇనుప గనులను తవ్వి వేల కోట్లు కూడబెట్టారన్న ఆరోపణలపై కేసులు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పెద్ద పీట వేసింది. గాలికి తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదంటూనే, రాయచూరు, బళ్లారి, కొప్పళ జిల్లాల్లోని 9 మంది మంది గాలి వర్గీయులకు టికెట్లను ఇచ్చింది. బళ్లారి నగర నియోజకవర్గానికి గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖరరెడ్డికి అవకాశం కల్పించింది. బళ్లారి రూరల్ నుంచి రాయచూరు మాజీ ఎంపీ, గాలి సన్నిహితుడు సణ్ణ ఫక్కీరప్పకు స్థానం కల్పించింది.

గాలి దగ్గరి సన్నిహితుడు ప్రస్తుత బళ్లారి ఎంపీ బీ శ్రీరాములుకు మొలకాల్మూరు టికెట్ ఇచ్చారు. వీరితో పాటు హగరిబొమ్మనహళ్లిలో నేమ రాజనాయక్‌, హూవినహడగలిలో చంద్రనాయక్‌, కంప్లిలో సురేష్‌ బాబులకు టికెట్లు ఖరారు చేయగా, వీరంతా గాలి అనుచరులే. ఇక 2008 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఈ మూడు జిల్లాల్లో ఓ వెలుగు వెలిగి, అంతే వేగంగా పాతాళానికి కూరుకుపోయిన గాలి జనార్దన్ రెడ్డి, తన వర్గం ఎమ్మెల్యేల్లో ఎందరిని గెలిపించుకుని అసెంబ్లీకి పంపుతారన్న విషయం మరో నెల రోజుల్లో తేలిపోతుంది .