ఏనుగు కారుణ్య మరణానికి మద్రాస్ హైకోర్టు అనుమతి

వాస్తవం ప్రతినిధి: తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న రాజేశ్వరి అనే ఏనుగు కారుణ్య మరణానికి మద్రాస్ హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. చెన్నై లోని సేలం జిల్లా అరుల్మిగ సుగవనేశ్వరార్ ఆలయంలో ఉన్న రాజేశ్వరి అనే పేరున్న ఏనుగు కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నది. వివిధ చికిత్సలు చేసినా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. ఈ నేపధ్యంలో చెన్నై కి చెందిన మురళీధరన్ అనే వ్యక్తి హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేయడం తో కేసును విచారించింది. అయితే వైద్యులు కూడా ఏనుగు ఆరోగ్యం మెరుగుపడదని ధ్రువీకరిస్తే కారుణ్య మరణానికి చర్యలు చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. గత నెలరోజుల నుంచి ఏనుగు పడుకునే ఉంటుందని పిటిషనర్ వివరించారు.. ఒకే పక్కన పడుకోవడంతో ఒంటిమీద పుండ్లు అయి, చర్మం కుళ్లిపోతున్నందున కారుణ్య మరణానికి అనుమతించాలని కోరాడు. దీనికి హైకోర్టు సమ్మతించింది.