ట్రంప్ నైతికంగా అనర్హుడు

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్‌ ట్రంప్‌ నైతికంగా అనర్హుడు అని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కొమీ అన్నారు. ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఆరోగ్యపరంగా ఆయన అధ్యక్ష పదవికి అనర్హులు అని తాను అనుకోవడం లేదని, కాకపోతే ఆయన నైతికంగా మాత్రం అనర్హుడు అని కొమీ పేర్కొన్నారు. అంతేకాకుండా ట్రంప్‌ మానసిక స్థితి సరిగాలేదని కొమీ ఆరోపించారు. అమెరికా దేశానికి సంబంధించిన కొన్ని మూల సూత్రాలను అధ్యక్షుడు తప్పకుండా గౌరవించాలని, అయితే ఈ అధ్యక్షుడు మాత్రం ఆ పని చేయలేరని ఆయన వెల్లడించారు. జేమ్స్‌ కోమీ ను ట్రంప్‌ 2017 మేలో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో హిల్లరీ క్లింటన్‌పై, ట్రంప్‌  ప్రచార కార్యక్రమంలో రష్యా కుట్ర అంశాలపై విచారణ సమయంలో ఎఫ్‌బీఐ సరిగా పనిచేయలేదని కోమీ ను పదవి నుంచి తప్పించారు. అధ్యక్ష ఎన్నికలకు  కేవలం 11రోజుల సమయం ఉందనప్పుడు క్లింటన్‌‌ వ్యక్తిగత ఈమెయిల్‌ సర్వర్‌ అంశంపై జేమ్స్‌ కోమీ తిరిగి కేసును తెరిచారు. క్లింటన్‌ ఓటమికి ఇది కూడా ప్రధానకారణమైంది కూడా. అయితే ఇటీవల ట్రంప్ అధ్యక్ష భవనాన్ని మాఫియా డాన్ లాగా నడుపుతున్నారని ఆయన రాసిన పుస్తకం లోని పలు అంశాలు లీకైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజగా ఒక ఇంటర్వ్యూలో లో భాగంగా కొమీ ట్రంప్ పై అవే వ్యాఖ్యలు చేయడం విశేషం.