చెన్నై సూపర్ కింగ్స్ కి మరో అవాంతరం

వాస్తవం ప్రతినిధి: రెండేళ్ళ విరామం తరువాత ఈ ఏడాది ఐపీఎల్‌ లో అడుగు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అన్నీ అవాంతరాలే. ఇప్పటికే గాయం కారణంగా కేదార్ జాదవ్ ఈ సీజన్ మొత్తానికి దూరం కాగా, మరో ఆటగాడు రైనా కూడా గాయం కారణంగా రెండు మ్యాచ్ లకు దూరం అయిన సంగతి తెల్సిందే. దానికి తోడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డ పై ఆడాల్సిన మ్యాచ్ లు అన్నీ కూడా పూణే కి తరలించిన సంగతి తెల్సిందే. అయితే ఇప్పుడు ఇక ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టోర్నీలో భాగంగా చెన్నై ఆడే తదుపరి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ నడుం నొప్పితో తీవ్ర ఇబ్బందిపడ్డాడు. నొప్పిని భరించలేక మధ్యలో ఆ జట్టు ఫిజయోను పిలిపించుకుని మరీ  ట్రీట్‌మెంట్‌ చేయించుకున్నాడు. దీంతో ఆ జట్టు తర్వాత ఆడే మ్యాచ్‌లో ధోనీ ఆడే విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘వెన్ను నొప్పి తీవ్రంగా బాధించింది. ఇప్పుడు కాస్త ఫర్వాలేదు. ఇలాంటి చిన్న చిన్న నొప్పులు భరిస్తూ ఆడే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు’ అని ధోనీ అన్నాడు. ఈ నేపధ్యంలో తదుపరి మ్యాచ్ లో ధోనీ ఆడతాడో లేదో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తరువాతి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనున్న సంగతి తెలిసిందే.