నిరాహారదీక్షల పేరుతో నాటకాలు ఆడుతున్నారు:శివసేన

వాస్తవం ప్రతినిధి: బిజేపీ, కాంగ్రెస్ లపై శివసేన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో రైతులంతా తినటానికి తిండి కూడా లేక చచ్చిపోతుంటే… ఈ రెండు పార్టీలు మాత్రం నిరాహారదీక్షల పేరుతో నాటకాలు ఆడుతున్నాయని విమర్శించింది. దీక్షలకు ముందు, దీక్షల సమయంలో ఈ రెండు పార్టీల నేతలు ఆహారం తీసుకుంటున్న ఫొటోలను చూపిస్తూ శివసేన పత్రిక సామ్నా విమర్శనాత్మక కథనాన్ని ప్రచురించింది.

నిరాహారదీక్షల వల్ల వీళ్లు ఏమి సాధించారనే విషయాన్ని ఏ ఒక్కరూ చెప్పలేరని ఎద్దేవా చేసింది. దేశంలో ఎంతో మంది ఇప్పటికీ ఆకలితో అలమటిస్తున్నారని… పోషకాహారం లేక పిల్లలు చనిపోతున్నారని… ఆకలి బాధలతో రైతు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని కథనంలో పేర్కొంది. ఒక్క మహారాష్ట్రలోనే బీజేపీ పాలనలో 3వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పింది.