వీగిపోయిన అవిశ్వాస తీర్మానం….16 మంది మంత్రుల రాజీనామా!

వాస్తవం ప్రతినిధి: శ్రీలంకలో గత కొద్ది రోజులుగా రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రధాని రానీల్ విక్రమ సింఘే పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ప్రధానికి అనుకూలంగా 122 మంది, ప్రతికూలంగా 76 మంది ఓటు వేశారు. అయితే ప్రధానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో 16 మంది సొంత భాగస్వామ్య పార్టీ మంత్రులు ఉండడం విశేషం.  ప్రధాని కి వ్యతిరేకంగా ప్రభుత్వంపై సంయుక్త ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన పదహారు మంది మంత్రులు గురువారం రాజీనామా చేశారు. కాసేపటి క్రితమే తమ రాజీనామాలను అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు అందచేసినట్లు మంత్రి లక్ష్మణ్‌యాపా అబెవర్దనె స్థానిక మీడియాకు తెలిపారు. రాజీనామా చేసిన మంత్రులు అధ్యక్షుడు సిరిసేన నేతృత్వంలోని అధికార శ్రీలంక ఫ్రీడం పార్టీకి చెందిన వారు. ఈ పార్టీ విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్‌ నేషనల్‌ పార్టీతో సంకీర్ణ భాగస్వామిగా ఉంది. రాజీనామాలు చేసిన వారిలో క్రీడల మంత్రి దయాసిరి శేఖర, సాంఘిక సంక్షేమ మంత్రి ఎస్‌బి దిస్సానాయకే, కార్మిక మంత్రి జాన్‌ సెనేవిరత్నే, శాస్త్ర, సాంకేతిక, పరిశోధన శాఖ మంత్రి ప్రేమ జయంతా, నైపుణ్యాభివృద్ధి, వృత్తి శిక్షణల శాఖ మంత్రి చాందిమ వీరక్కోడి, డిప్యూటి స్పీకర్‌ తిలంగ సుమతిపాల ఉన్నారు. ప్రధానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన మంత్రులతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యుఎన్‌పి), అధ్యక్షుడికి ఫిర్యాదు చేసిన నేపధ్యంలో వారు తమ పదవులకు రాజీనామా చేశారు. దానికి అధ్యక్షుడు కూడా అనుమతి ఇచ్చినట్లు మంత్రి అబెవర్ధన తెలిపారు.