బెంగళూరు చేరిన కేసీఆర్ టీమ్… వెంట ప్రకాష్ రాజ్ కూడా

వాస్తవం ప్రతినిధి: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. కొత్త రాజకీయ కూటమి(ఫెడరల్ ఫ్రంట్) ఏర్పాటుపై చర్చించేందుకు కొద్దిసేపటి క్రితం కర్ణాటక రాజధాని బెంగళూరు చేరుకొన్నారు.సీఎంతో పాటు ఎంపీలు సంతోష్ కుమార్, వినోద్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, శేఖర్ రెడ్డిలతో పాటు నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉండటం గమనార్హం.

బెంగళూరులో ఈ మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై తృతీయ కూటమిపై చర్చించనున్నారు. పద్మనాభ నగర్ లోని దేవెగౌడ నివాసానికి వెళ్లే కేసీఆర్, అక్కడే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. దేశ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై దేవెగౌడ సలహాలను, సూచనలను తీసుకోనున్నారు. చర్చల అనంతరం సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి అరవింద్ కేజ్రీవాల్ నూ కేసీఆర్ కలవనున్నారు. ఇప్పటికే కూటమి కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కేసీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కూటమికి ఆమె మద్దతు తెలిపారు. ఆపై జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ తో మాట్లాడి వెళ్ళినట్లు తెలుస్తోంది.