ఇద్దరు భారత అథ్లెట్ల పై సస్పెన్షన్ వేటు

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా వేదికగా గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌ లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ గేమ్స్ నుంచి ఇద్దరు భారత అథ్లెట్లు సస్పెన్షన్‌కు గురైనట్లు తెలుస్తుంది.  ‘నో నీడిల్స్‌’ పాలసీ నిబంధనలను ఉల్లంఘించిన నేపధ్యంలో భారత అథ్లెట్లు రాకేశ్‌ బాబు, ఇర్ఫాన్‌ కోలోథమ్‌ థోడిపై కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్(సీజీఎఫ్‌)‌ చర్యలు తీసుకుంది. వారిని వెంటనే గోల్డ్‌కోస్ట్‌ వదిలి స్వదేశానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.  నో నీడిల్స్ నిబంధలకు విరుద్దంగా ఈ ఇద్దరి అథ్లెట్ల గదిలో నీడిల్‌ దొరకడంతో ఫెడరేషన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.  గేమ్స్‌లో పాల్గొనకుండా వారిని సస్పెండ్‌ చేస్తున్నాం. వారి అక్రిడిటేషన్‌ను కూడా రద్దు చేశాం. క్రీడా గ్రామం నుంచి కూడా పంపించి వేశాం. వారిని వెంటనే స్వదేశానికి పంపించాల్సిందిగా కామన్వెల్త్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు సమాచారం అందించాం’ అని సీజీఎఫ్‌ అధ్యక్షుడు లూయిన్‌ మార్టిన్‌ వెల్లడించారు.