అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్..హత్య!

వాస్తవం ప్రతినిధి: మానవత్వం మంటగలిసింది… మతోన్మాదానికి ముక్కుపచ్చలారని ఓ పసి ప్రాణం బలైపోయింది.అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిని గుడిలో బంధించి నాలుగు రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేసిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అన్నది చూస్తే.. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా హీరానగర్ పరిధి రస్సానాలో గ్రామంలో జరిగిన పాశవిక చర్యపై దేశం యావత్తు రగలిపోతుంది. గోవధ, మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా చేస్తున్నారనే అనుమానంతో బకర్వాల్ ముస్లింలను గ్రామం నుంచి తరిమేయాలని నిర్ణయించుకున్న నిందితులు, వారి కుటుంబానికి చెందిన అభం శుభం తెలియని 8 ఏళ్ల చిన్నారిని బంధించి.. నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణంలో రిటైర్డ్ రెవెన్యూ అధికారి సాంజీ రామ్ తో పాటు అతని మేనల్లుడు.. కొడుకు.. మేనల్లుడి స్నేహితుడు.. ఒక ఎస్ ఐ.. మరో హెడ్ కానిస్టేబుల్.. ఇద్దరుప్రత్యేక పోలీస్ అధికారుల్ని నిందితులుగా చార్జిషీటులో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంపై తాజాగా జమ్ముకశ్మీర్ క్రైంబ్రాంచ్ పోలీసులు అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. ఇందులో ఉన్న అంశాల్ని చూస్తే..

జనవరి 10న తన ఇంటి బయట గుర్రాల్ని మేపుతున్న బాలికను అపహరించిన సాంజీరామ్ తమకు చెందిన గుడికి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చారు. ఆ తర్వాత ఆ చిన్నారిపై అత్యాచారం చేయాలని తన మేనల్లుడు సాంజీరామ్ ను ఊసిగొల్పారు. ఆ తర్వాత కొడుకు విశాల్.. పోలీసు అధికారి దీపక్ కూడా అత్యాచార దుర్మార్గానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల పాటు ఒకరి తర్వాత ఒకరు అనేకసార్లు ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత జనవరి 14న సాంజీ మేనల్లుడు ఆమెను దుడ్డుకర్రతో తీవ్రంగా కొట్టి చంపేశాడు. ఆమె మృతదేహాన్ని గుడికి సమీపంలోని అడవుల్లో పడేశారు.

ఈ దారుణాన్ని కప్పి పుచ్చేందుకు స్థానిక పోలీసులకు రూ.3లక్షల లంచం ఇచ్చారు. ఇప్పటివరకూ ఈ కేసులో మొత్తం 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ నెల 16న స్థానిక కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. ఈ ఘటనపై విచారణ జరపాలంటూ జమ్ముహైకోర్టు బార్ అసోసియేషన్ బంద్ కు పిలుపునివ్వటంతో బుధవారం జనజీవనం స్తంభించింది.