ప్రత్యేక హోదా ఉద్యమ యాత్ర చేసే అర్హత టీడీపీ ప్రభుత్వానికి లేదు: రోజా

వాస్తవం ప్రతినిధి: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూట్ కేసులు దాచుకోవడానికి సింగపూర్ కు, కేసులు మాఫీ కోసం ఢిల్లీకి వెళ్లడమే చంద్రబాబుకు తెలుసని ఆరోపణలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆ పార్టీ ఎంపీ జేసీ చేసిన వ్యాఖ్యలే టీడీపీ వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా ఉద్యమ యాత్ర చేసే అర్హత టీడీపీ ప్రభుత్వానికి లేదని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కొనఊపిరితో ఉన్న ప్రత్యేకహోదా అంశాన్ని బతికించింది వైఎస్ జగన్ అని, తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని నెల్లూరులో నాడు జగన్ ప్రకటించకపోయినట్లయితే ఈరోజున ప్రత్యేకహోదా గురించి ఎవరూ మాట్లాడేవారు కాదని అన్నారు. కాగా, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని దగాగా మార్చారని, హోదా హామీ మాటలకు చంద్రబాబు సమాధి కట్టారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి చంద్రబాబు శల్యుడు లాంటి వారని, సారథిగా ఉన్నట్లు నటించే యత్నం చేస్తూ ఉద్యమాన్ని నీరు గార్చాలని చూస్తున్నారని విమర్శించారు.