ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాదం..ముగ్గురు చిన్నారులు మృతి

వాస్తవం ప్రతినిధి: ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడ కూలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక మంగమూరు రోడ్డులోని కొత్తడొంకలో గుడిమెట్ల నవదీప్ (8), కట్టామణి (8), సింధే ప్రేమచంద్ (9), అతని సోదరి సింధే ప్రేమ్ జ్యోతి ఈరోజు పాఠశాలకు వెళ్లి తిరిగి తమ ఇళ్లకు వచ్చారు. తమ ఇళ్లకు సమీపంలో చిన్నారులు కలిసి ఆడుకుంటున్న సమయంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి వీరిపై పడింది. ఈ ప్రమాదంలో నవదీప్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మణి, ప్రేమ్ చంద్ ప్రాణాలు విడిచారు. ప్రేమ్ జ్యోతికి మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.