నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన పీఎస్‌ఎల్వీ-సి41

వాస్తవం ప్రతినిధి: దేశీయ దిక్సూచి వ్యవస్థ (డొమెస్టిక్ కంపాస్ సిస్టమ్) కోసం ఉద్దేశించిన పీఎస్‌ఎల్వీ-సి41 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. నేటి తెల్లవారు జామున 4:04 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ లక్ష్యాన్ని చేరుకుంది. 32 గంటల కౌంట్‌ డౌన్‌ అనంతరం షార్‌ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగికెగసి, కేవలం 19.19 నిమిషాల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు దశల తరువాత రాకెట్ నుంచి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహం విడిపోయి, శాస్త్రవేత్తలు నిర్ణయించిన సమయానికి కక్ష్యలోకి ప్రవేశించింది.

ఈ ఉపగ్రహం బరువు 1425 కేజీలు. గతేడాది ఆగస్టు 31న పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ ఉపగ్రహం ఉష్ణ కవచం తెరుచుకోకపోవడంతో బయటకు రాలేకపోయింది. దీంతో ఆ ప్రయోగం విఫలమైనట్టుగా ఇస్రో ప్రకటించింది. దాని స్థానంలో ఈ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దీంతో దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఇస్రో ఇప్పటి వరకు 8 నావిగేషన్‌ శాటిలైట్లను నింగిలోకి పంపినట్టయింది.