సెనేట్ సభ్యులకు క్షమాపణలు తెలిపిన జుకర్ బర్గ్

వాస్తవం ప్రతినిధి: కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా ద్వారా మిలియన్ల ఖాతాదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేశారనే అంశంపై ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌ అమెరికా కాంగ్రెస్‌ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. సూటు బూటు ధరించి చక్కగా ఎప్పుడూ చూడని రీతిలో రెడీ అయి సెనేట్ సభ్యుల ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా సెనేట్‌ సభ్యులకు క్షమాపణలు తెలిపారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 87 మిలియన్ల ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను ఎలా దోచుకుందన్న ప్రశ్నలను ఎదుర్కొంటున్న నేపధ్యంలో మంగళవారం సెనేట్ ముందు హాజరయ్యారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఇది తన తప్పని, క్షమించాలని కోరారు. తాను ఫేస్‌బుక్‌ ప్రారంభించానని, తానే దానిని నడిపానని, కాబట్టి ఏం జరిగినా దానికి బాధ్యత తానే వహిస్తానని అన్నారు. హాని చేయడం కోసం ఉపయోగిస్తున్న ఈ సాధనాలను నిరోధించడానికి తాము తగినంత పని చేయలేదని స్పష్టం అవుతోందని ఆయన సెనేట్ సభ్యులకు వివరించారు. వివిధ దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, వాటి ప్రాముఖ్యత తనకు తెలుసునని, ఎన్నికల సమగ్రతను కాపాడుతానని తెలిపారు.