మమ్మల్ని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుంది: రబ్రీ దేవి

వాస్తవం ప్రతినిధి:  తనను, తన కుటుంబాన్ని హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి ఆరోపిస్తున్నారు. దానా కుంభకోణం కేసులలో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం బిర్సా ముందా జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తనను తన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఆమె ఆరోపించారు.  ఈ మేరకు ఆమె ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్‌కు లేఖ రాశారు. తమ కుటుంబానికి ఎటువంటి నష్టం జరిగినా, దానికి హోంశాఖ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని ఆమె ఆ లేఖలో ఆరోపించారు. మంగళవారం రాత్రి లాలూ ప్రసాద్ ఇంటి వద్ద ఉన్న 32 మంది జవాన్ల ను అకస్మాత్తుగా ఉపసంహరించారు. అయితే ఈ ఘటనపై లాలూ భార్య రబ్రీదేవి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని చంపాలన్న కుట్రలో భాగంగా సెక్యూర్టీని ఎత్తేశారని, నితీశ్, సుశీల్ మోదీలు ఈ కుట్రకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. లాలూ జైలులో ఉన్నారని, ఆయన ప్రతి రోజు ప్రాణాలతో పోరాడుతున్నాడని, ఆయనకు షుగర్ లెవల్స్ పెరిగాయని, ఇంటి నుంచి వెళ్లిపొమ్మంటే, వెళ్లిపోతామని రబ్రీ దేవి తెలిపారు.