ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది కార్యాలయాల్లో ఎఫ్ బీఐ సోదాలు

 వాస్తవం ప్రతినిధి: మన దేశంలో అధికారంలో ఉన్నవాళ్లని కన్నెత్తి చూడటానికి కూడా సాహసించవు. కానీ, అమెరికాలో ఏకంగా దేశాధ్యక్షుడికి సంబంధించిన వ్యవహారంపైనే ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత న్యాయవాది కార్యాలయాల్లో అదేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సోదాలు చేయడం దుమారం రేపింది. న్యాయస్థానం అనుమతితో న్యూయార్క్‌లోని మైకేల్‌ కొహైన్‌ కార్యాలయాల్లో ఎఫ్‌బీఐ తనిఖీలు చేసింది. ట్రంప్‌తో లైంగిక సంబంధం ఉందని ఆరోపించిన శృంగార తార స్టానీ జీనియస్‌ అమెరికా అధ్యక్ష ఎన్నిక సమయంలో మౌనంగా ఉండేందుకు మైకేల్‌ లక్షా 30వేల డాలర్లు చెల్లించడానికి సంబంధించిన బ్యాంకు రికార్డులు, ఈమెయిల్‌ సహా వేర్వేరు అంశాలతో ముడిపడిన కీలక పత్రాలను ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ట్రంప్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టు చెప్తున్న ఓ శృంగార తారకు కోహెన్ చెల్లించిన 1.30 లక్షల డాలర్లకు సంబంధించిన ఆధారాలనుకూడా ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ దాడులపై ట్రంప్ స్పందిస్తూ ఎఫ్‌బీఐపై తీవ్ర విమర్శలు చేశారు. ఎఫ్‌బీఐ దాడులు అవమానకరమని, ఇది దేశంపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు.  కోహెన్ కార్యాలయాల నుంచి పత్రాలతోపాటు ఈమెయిళ్లు, వ్యాపార సంబంధిత పత్రాలను, బ్యాంకు రికార్డులను, శృంగార తార స్టార్మీ డానియెల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుందని కోహెన్ ప్రతినిధి స్టీఫెన్ రయన్ పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ పలురకాల సెర్చ్ వారెంట్లను అమలు చేసిందని ఆయన తెలిపారు. కోహెన్‌కు, అతని క్లయింట్లకు సంబంధించిన సమాచారాన్ని ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకోవడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. దేశాధ్యక్షుని వ్యక్తిగత న్యాయవాది కార్యాలయాలపై ఎఫ్‌బీఐ దాడి చేసి, అధ్యక్షునికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకోవడం విశేషమని పరిశీలకులు పేర్కొంటున్నారు.