వాస్తవం ఉత్తమ వైద్య సేవకులు: ఉద్దానం వైద్య బృందం

వాస్తవం ప్రతినిధి: సామాజిక సేవ ను ప్రోత్సహించే ప్రయత్నం లో భాగంగా వాస్తవం మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ కార్పొరేషన్ ప్రతి ఏటా నిర్వహించే “వాస్తవం అవార్డు ల ప్రదానోత్సవం” గత వారాంతం అమెరికాలోని న్యూ జెర్సీ లో దాదాపు 550 మంది ప్రముఖ డాక్టర్లు , వ్యాపార వేత్తలు, తెలుగు సంఘాల ప్రముఖులు , కళాకారులు , సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వంటి ఆహుతుల మధ్య విజయవంతంగా ముగిసింది . ఎంతో మంది తెలుగు జాతి గర్వించ దగ్గ సేవా ప్రముఖుల్ని  వారు చేసిన సామాజిక సేవ ను అభినందిస్తూ వేదిక మీద గౌరవించారు.

ఈ కార్యక్రమం లో భాగంగా శ్రీకాకుళం జిల్లా లో అంతు చిక్కని కిడ్నీ వ్యాధి బారిన పడి వేలాది మంది పేద ప్రజ ల మరణానికి కారణమైన ఉద్దానం సమస్యపై అనేక సంవత్సరాలుగా పరిశోధిస్తూ, అమోఘమైన సేవ చేస్తూన్న డా. కుమార్ కొత్తపల్లి , డా. రవి ఆకుల, డా. దుర్గా వేగులాడ , డా. సందీప్ పంచకర్ల , డా. సూర్య రగుతు, శ్రీ శశాంక్ నిమ్మల బృందాన్ని వాస్తవం వేదిక పై వారిని  ప్రశంసించి, సన్మానించారు.

టెక్సాస్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ మెడికల్ జెనిటిక్స్ శాస్త్రవేత్త శ్రీ డా. కుమార్ కొత్త పల్లి ఈ సందర్భంగా ఉద్దానం ప్రాంత ప్రజల ఆరోగ్య సమస్యల పై , అందుకు పరిష్కారం గా తాము చేస్తున్న సేవల ను ఓ వీడియో రూపంలో సభలో ప్రదర్శించారు. ఆయన తాము గత 15 సంవత్సరాలుగా ఈ ప్రజారోగ్య సమస్య పరిష్కారానికి చేస్తున్న కృషి ని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు , జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ తమ పరిశోధనలకు , వ్యాధి గ్రస్తులను ఆదుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు అనేక విధాలుగా సహకరిస్తున్నారని ఆయన తెలియచేసారు .

శ్రీ పవన్ కళ్యాణ్ జోక్యం తో ఉద్దానం సమస్య కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అని, జన సేన పార్టీ కి సంభందించిన శ్రీ రాఘవయ్య గారు తమకు ఎంతో సహకారాన్ని అందించినట్లు ఉద్దానం వైద్య బృందం సభకు తెలియచేసారు.

ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీ డా. రవి ఆకుల ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం తన ఉద్దానం ప్రాంత పర్యటన గురించి మాట్లాడుతూ , ఆ ప్రాంత ప్రజల కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా వివరించారు . కనీసం సరిగ్గా మూడు పూటలా తినడానికి కూడా లేని ఆ ప్రజలు , రెక్కాడితే గానీ డొక్కాడని ఆ ప్రజల కష్టాల ను అత్యంత విపులంగా సభకు తెలియచేసారు . ఆయన ప్రసంగం సభికులను కదిలించి అనేక మంది ముందుకు వచ్చి తమ విరాళాలను ప్రకటించడమే కాకుండా, భవిష్యత్తు లో తాము ఈ పవిత్ర కార్యక్రమానికి ఉద్దానం వైద్యుల బృందానికి అండ దండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

గత సంవత్సరం శ్రీ పవన్ కళ్యాణ్ అమెరికా లో హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి ప్రత్యేక అతిధి గా వచ్చినప్పుడు తమ బృందం ఆయన్ని కలిసి తమ వైద్య పరిశోధన కు సంబంధించి న వివరాల తో పాటు , వ్యాధి నివారణకు తీసుకోవలసిన కొన్ని సూచనలను అందచేసినట్లు ఆయన గుర్తుచేశారు . అందుకు జనసేన అధినేత వెంటనే స్పందించి, సమస్యను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దృష్టి కి తీసుకొని వెళ్లడమే కాకుండా అనేక సార్లు ఉద్దానం ప్రాంతాన్ని సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు శ్రీ డా. రవి ఆకుల తెలియ చేశారు .

ఆంధ్ర ప్రదేశ్ నుండి వాస్తవం అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి హాజరు కావలసి కొన్ని కారణాల వలన అమెరికా కు రాలేక పోయిన శ్రీ డా. దుర్గా వేగులాడ , జన సేన పార్టీ ప్రతినిధులు అయిన శ్రీ రాఘవయ్య , శ్రీ డా. సందీప్ పంచకర్ల తమ వీడియో సందేశాలను వాస్తవం కు అందచేశారు. వారి వీడియో మెసేజ్ లకు సభలో మంచి స్పందన లభించింది.

ప్రజా సమస్యల పై మానవత్వం తో అమోఘ మైన సేవ చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన శ్రీ డా. దుర్గా వేగులాడ , జనసేన పార్టీ కి ప్రతినిధులు అయిన శ్రీ రాఘవయ్య మరియు శ్రీ డా . సందీప్ పంచకర్ల కు 2018 సంవత్సరానికి ఉత్తమ సేవా ప్రముఖులుగా వాస్తవం అవార్డు లను ప్రకటించింది

టెక్సాస్ రాష్ట్రానికి చెందిన జన సేన NRI ప్రతినిధి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీ శశాంక్ నిమ్మల కు ఉద్దానం మరియు సామాజిక సేవ విభాగంలో Most Inspiring Young Adult అవార్డు ను ఇచ్చి వాస్తవం బృందం ఆ యువకుడిని గౌరవించింది.

ఉద్దానం కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ఆర్ధికంగా సహాయ పడటానికి అమెరికాలో స్కూల్ విద్యార్ధినీ, విద్యార్థులు లావణ్య అందే , నిహారికా కొత్తపల్లి , శృతి ఆకుల , అభిషేక్ ఆకుల , ప్రముఖ్ సాధనాల , శ్రీయ కందర్ప , సాయి వేల్పూరి , అనీక వేల్పూరి , రీవా పాలూరి , నీల్ రగుతు ఒక బృందం గా ఏర్పడి గత కొంత కాలంగా అనేక ప్రదేశాల్లో విరాళాలు సేకరించి ఆ వచ్చిన మొత్తాన్ని వ్యాధి గ్రస్తులకు అందచేయడం జరుగుతుంది.  వాస్తవం యాజమాన్యం వారిని గుర్తించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వేదిక పై పెద్దల సమక్షంలో వారి కి అవార్డులు అందచేశారు .

ఉద్దానం వైద్య బృందం శ్రీకాకుళం జిల్లా కిడ్నీ వ్యాధి నివారణకు, అమెరికాలోని హార్వార్డ్ విశ్వవిద్యాలయం లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన సిఫార్సు లు ఇవే :

1. MASS SCREENING AND EARLY DETECTION OF DISEASE:
* వ్యాధి ని ముందుగానే గుర్తించడానికి సామూహిక వైద్య పరీక్షలు
2.  STRENGTHEN HUMAN RESOURCES:
* వ్యాధి నివారణ మరియు నయం చేయడానికి మానవ వనరులు పెంపొందించడం
3. SURVEILLANCE SYSTEM:
*  కార్యక్రమ సమగ్ర పర్యవేక్షణ
4. PROVIDING SAFE DRINKING WATER TO CKDU AFFECTED AREAS:
* ఉద్దానం ప్రాంతం లో రక్షిత మంచినీటి సదుపాయాన్ని కల్పించడం.
5. COMPREHENSIVE RESEARCH PLAN:
* సమగ్ర పరిశోధన ప్రణాళిక
6. CREATION OF DISEASE AWARENESS:
* ప్రజల్లో వ్యాధి పై అవగాహన కలిగించడం.