చరణ్ తో కలిసి ‘రంగస్థలం’ చూసిన పవన్ కళ్యాణ్

వాస్తవం సినిమా: సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోని ప్రముఖులంతా కూడా ఈ సినిమా చూసి టీమ్ ను అభినందించారు. రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉండటం వలన నిన్నటి వరకూ పవన్ కల్యాణ్ ఈ సినిమా చూడటం కుదరలేదు. నిన్న రాత్రి తన సతీమణితో కలిసి హైదరాబాద్ .. ఐ మాక్స్ లో ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు. చరణ్ .. ఉపాసనతో పాటు ఈ సినిమా దర్శక నిర్మాతలు కూడా వాళ్లతో థియేటర్ కి వచ్చారు.

ఈ సినిమా చూసిన పవన్ కల్యాణ్ .. మీడియాతో మాట్లాడుతూ “నేను చేసిన ‘తొలిప్రేమ’ తరువాత మళ్లీ థియేటర్ కి వచ్చి చూసిన సినిమా ఇదే. నిర్మాతలు ఒక గొప్ప చిత్రాన్ని తీసినందుకు సంతోషంగా వుంది. వాస్తవానికి దగ్గరగా చాలా మంచి కథను సిద్ధం చేసుకుని .. ఆ కథను నడిపించే తీరుతో సుకుమార్ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఇక నటన పరంగా చరణ్ అదరగొట్టేశాడు .. నా మనసుకు బాగా నచ్చిన సినిమాల్లో ఇదొకటి” అని చెప్పుకొచ్చారు.