సిరియా లో క్షిపణి దాడి

వాస్తవం ప్రతినిధి:  సిరియాలో మిలిటరీ విమానాశ్రయంపై క్షిపనుల దాడి చోటుచేసుకుంది. ఈ దాడిలో సుమారు 14 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. రెబల్స్ ఆధీనంలో ఉన్న దౌమా పట్టణంపై శనివారం రసాయనిక దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిలో సుమారు 100 మందికి పైగా చనిపోగా మరికొంత మంది గాయపడినట్లు తెలుస్తుంది. అయితే ఆ దాడికి ప్రతీకారంగా హోమ్స్ సిటీలో ఉన్న టియాస్ ఎయిర్‌బేస్‌పై దాడి జరగగా, పశ్చిమ దేశాలు ఆ దాడికి పాల్పడినట్లు సిరియా ఆరోపిస్తున్నది. తాజా రసాయనిక దాడికి ప్రతిఫలం తప్పదని అమెరికా, ఫ్రాన్స్ దళాలు ఇప్పటికే హెచ్చరించాయి. కానీ మిలిటరీ ఎయిర్‌పోర్ట్‌పై తాము దాడి చేయలేదని ఆ రెండు దేశాలు స్పష్టం చేశాయి. దౌమాలో జరిగిన కెమికల్ దాడికి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా సిరియా అధ్యక్షుడు బాషర్ అల్ అసద్ ఓ మృగమంటూ  ట్రంప్ ఆరోపించారు. దౌమాలో ఉన్న రెబల్ ఫైటర్లు ప్రభుత్వ దళాలకు లొంగిపోతున్నారు. రసాయనిక దాడికి ఘాటుగా స్పందిస్తామని ట్రంప్, మాక్రన్‌లు సంయుక్తంగా ప్రకటన చేసిన అనంతరం ట్రంప్ మళ్ళీ పై ప్రకటన చేశారు.సిరియా లో క్షిపణి దాడి