శిఖరాగ్ర సదస్సు ఎక్కడ అనే దానిపై ఇంకా తీసుకోని నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ ల మధ్య శిఖరాగ్ర సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ సదస్సు కంటే ముందు ఉభయ దేశాలూ రహస్య ప్రత్యక్ష చర్చలు జరుపుతున్నాయని అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మేలో జరుగనున్న ఇరుదేశాల శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు సిఐఎ డైరెక్టర్‌ మైక్‌ పాంపియో నేతృత్వంలోని ఒక బృందం పనిచేస్తోందని ఇంటెలిజెన్స్‌ వర్గాలను ఉటంకిస్తూ అధికారులు మీడియాకు చెప్పారు. అమెరికా, ఉ.కొరియా ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇప్పటికే పలుమార్లు ఫోన్‌లో భేటీ అయ్యారని, మరో దేశంలో వారు ప్రత్యక్ష చర్చలు కూడా జరిపారని ఈ వర్గాలు వివరించాయి. అయితే అమెరికా అధ్యక్షుడితో కిమ్‌జోంగ్‌ ఉన్‌ భేటీ విషయాన్ని ఇప్పటి వరకూ ఉ.కొరియా ప్రభుత్వం అధికారికంగా నిర్ధారించనప్పటికీ, గత నెలలో ఈ అంశాన్ని వెల్లడించిన ద.కొరియా దౌత్యవేత్త ఈ భేటీకి ట్రంప్‌ అంగీకరించిన విషయం ఉ.కొరియాకు తెలుసునని చెబుతున్నారు. కొరియా ద్వీపకల్పాన్ని అణు నిరాయుధీకరణ చేసే అంశంపై చర్చించేందుకు తమ నేత సిద్ధంగా వున్నారని ఉ.కొరియా ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది కూడా.  అయితే ఈ శిఖరాగ్ర సదస్సు వేదిక ఎక్కడ నిర్వహించాలి అనే దానిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ శిఖరాగ్ర సదస్సును ఫ్యాంగ్‌యాంగ్‌లోనిర్వహించాలని ఉ.కొరియా అధికారులు భావిస్తున్నప్పటికీ దీనికి అమెరికా సిద్ధంగా వున్నదీ లేనిదీ ఇంకా వైట్‌ హౌస్‌ వెల్లడించకపోవటం గమనార్హం.