ఉత్తర ప్రదేశ్ లో పరిస్థితి మారకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు: అమిత్ షా

వాస్తవం ప్రతినిధి:ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ అధిష్ఠానం సీరియస్ గా ఉంది. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం విఫలమవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయని, పరిస్థితి మారకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.

స్వయంగా సీఎం, డిప్యూటీ సీఎం ఖాళీ చేసిన పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే, అధికారంలో ఉండి కూడా దక్కించుకోలేక పోవడాన్ని ఆ పార్టీ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతోంది. తాను స్వయంగా 11వ తేదీన లక్నోలో పర్యటించి నేతలందరినీ కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై వారి అభిప్రాయాన్ని స్వీకరిస్తానని, ఆపై ఓ నిర్ణయానికి వస్తానని షా చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటికే జరుగుతున్న ఘటనలపై వివరణ ఇవ్వాలని యోగి ఆదిత్యనాథ్ ను ప్రధాని ఆదేశించారు. ఆర్ఎస్ఎస్ నేతలు కృష్ణ గోపాల్, దత్తాత్రేయ హొసబలేలు మూడు రోజుల పాటు యూపీలో పర్యటించి స్థానిక పరిస్థితులపై రిపోర్టును తయారు చేసి మోదీకి అందినట్టు కూడా తెలుస్తోంది.