సొంత పార్టీ పైనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలు

వాస్తవం ప్రతినిధి: ఒకపక్క ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కొక్కరు సొంత పార్టీ పైనే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో కూడా అధికారం చేపట్టాలని బీజేపీ వువ్విల్లురుతున్న ఈ సమయంలో ఈ విధంగా సొంత పార్టీ నేతలే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ నియోజక వర్గ ఎంపీ ఉదిత్‌ రాజ్‌ కూడా సొంత పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ బంద్‌ తర్వాత దళితులపై హింస పెరిగిపోయిందంటూ ప్రకటించి బాంబు పేల్చారు. ‘ఏప్రిల్‌ 2న భారత్‌ బంద్‌ తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయి. ఈ మేరకు ఆధారాలతోసహా కథనాలు కూడా వెలువడుతున్నాయి. వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ శనివారం ఉదిత్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘బార్మర్‌, జలోరే, జైపూర్‌, గ్వాలియర్‌, మీరట్‌, బులంద్‌షహర్‌, కరోలి.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో దళితులపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు హింసిస్తున్నారు’  అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన పేర్కొన్న ప్రాంతాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండటంతో ఇప్పుడు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు మొదలయ్యాయి.