క్యాచ్ అండ్ రిలీజ్ కు స్వస్తి పలకాలి అన్న ట్రంప్

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త కొత్త సంచలన నిర్ణయాల తో ముందుకు దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్న వెంటనే విడుదల చేసే ‘క్యాచ్‌ అండ్‌ రిలీజ్‌’ విధానానికి స్వస్తి పలకాలని.. ట్రంప్‌ ఉత్తర్వులు  జారీ చేశారు. ఈ నేపధ్యంలో అక్రమ వలసదారులను నిర్బంధించేందుకు ఉపయోగపడే వివిధ సైనిక వసతుల జాబితాను అందజేయాలని రక్షణ మంత్రిత్వశాఖను కోరినట్లు తెలుస్తుంది. అమెరికాలో అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్న తర్వాత నిర్బంధించి ఉంచేందుకు తగినన్ని వనరులు లేకపోవడంతో.. వలసల న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సిన తేదీని వారికి చెప్పి భద్రతాసంస్థలు వదిలేస్తుంటాయి. అయితే ఈ విచారణలకు హాజరైతే తమను దేశం నుంచి బయటకు పంపేస్తారన్న భయంతో.. అక్రమ వలసదారులు ఆ తేదీ కి న్యాయస్థానం ముందుకు రారు.  ఈ క్రమంలో ట్రంప్ తాజాగా క్యాచ్ అండ్ రిలీజ్ విధానానికి స్వస్తి పలకాలంటూ ఉత్తర్వులు జారీ చేసారు. సరిహద్దుల వద్ద అక్రమ మానవ రవాణా కార్యాకలాపాలు, మాదకద్రవ్య సంబంధిత నేరాలు, నేరస్థుల చొరబాట్లు.. అమెరికా భద్రతకు తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. అక్రమ వలసలకు సంబంధించిన కేసుల భారం కూడా వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది అని ట్రంప్‌ ఈ తాజా ఉత్తరువులో పేర్కొన్నట్లు తెలుస్తుంది.