ఇంజిన్ లేకుండా 10 కిలోమీటర్లు  ప్రయాణించిన రైలు….ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్

వాస్తవం ప్రతినిధి:  రైలింజన్ లేకుండా ఒక రైలు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఓడిశా లోని టిట్లా గడ్-కేసింగా రైల్వే స్టేషన్ ల మధ్య  రైలింజన్ లేకుండానే 22 బోగీల రైలు శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అహ్మదాబాద్ – పూరి ఎక్స్‌ప్రెస్‌కు టిట్లాగఢ్ స్టేషన్ వద్ద ఇంజిన్ అమర్చే క్రమంలో రైల్వే సిబ్బంది బ్రేకులు సరిగ్గా వేయలేదు. రైల్వే సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడం కారణంగానే.. ఆ రైలు దానంతట అదే 10 కిలోమీటర్లు వెళ్లింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు. కొంతమంది ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. కేసింగా వైపు వెళ్తున్న రైలును ఆపేందుకు.. పెద్ద రాళ్లను రైలు పట్టాలపై అమర్చారు. దీంతో రైలు ఆగిపోయింది. అయితే ఈ ఘటనలో అదృష్ట వశాత్తు  ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. మళ్లీ రైలుకు ఇంజిన్ అమర్చి టిట్లాగఢ్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే ఈ ఘటనకు కారణమైన ఇద్దరు రైల్వే ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.