సౌదీ అరేబియా లో 35 ఏండ్ల తర్వాత థియేటర్ లో సినిమా

వాస్తవం ప్రతినిధి: సౌదీ అరేబియాలో దాదాపు 35 ఏండ్ల తర్వాత సినిమా థియేటర్‌లో సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ నెల 18న రాజధాని రియాద్‌లో బ్లాక్ పాంథర్ అనే సినిమాను ప్రేక్షకులు వీక్షించనున్నారు. 70వ దశకం వరకు సౌదీ అరేబియాలో సినిమాల ప్రదర్శన కొనసాగినప్పటికీ ఆ తర్వాత అరబ్ ప్రాంతంలో ఇస్లామిక్ చట్టాల ప్రాబల్యం పెరిగిన నేపథ్యంలో సినిమాల ప్రదర్శనపై నిషేధం విధించారు. అయితే అప్పటి నుంచి ప్రజలు ఇంట్లోనే సినిమాలను చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల సినిమాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని 2017లో సౌదీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక, సామాజిక సంస్కరణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2030లోపు దేశవ్యాప్తంగా 350 సినిమా థియేటర్లను నెలకొల్పి అందులో 2,500 వెండితెరలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. టిక్కెట్ల విక్రయం ద్వారా సంవత్సరానికి 1బిలియన్ డాలర్లు(రూ.6500కోట్లు) వస్తాయని అంచనా వేసినట్లు వివరించింది.