సల్మాన్ మరిన్ని రోజులు జైల్లోనే..

వాస్తవం ప్రతినిధి: కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలి.. ప్రస్తుతం జోధ్‌పూర్ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై సెషన్స్ కోర్టు శనివారం తీర్పు వెల్లడించవలసి ఉంది.జైలు కెళ్లిన 24 గంటల్లోనే బెయిలు వస్తుందన్న ఆశతో గడిపిన సల్మాన్‌ ఆశ శుక్రవారం నీరుగారిపోయింది. శనివారం పిటిషన్‌ విచారణకు రావాల్సి ఉండగా.. రాజస్థాన్‌ హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. జోధ్‌పూర్‌ జిల్లా మరియు సెషన్స్‌ జడ్జిని బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సల్మాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటున్న సెషన్స్‌ జడ్జి రవీంద్ర కుమార్‌ జోషితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 87 మంది జడ్జిలను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సల్మాన్‌ బెయిల్‌ పిటిషన్‌ వాయిదా పడినట్లేనని.. ఆయన మరిన్ని రోజులు జైల్లోనే గడపాల్సి ఉంటుందని న్యాయ నిపుణలు చెబుతున్నారు. నిజానికి సల్మాన్‌కు శిక్ష ప్రకటించిన రోజే (గురువారం) బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే కేసుపై మరోసారి పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ఆయనకు బెయిల్‌ ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ధారిస్థానని జడ్జి జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం సల్మాన్‌కు బెయిల్‌ వస్తుందని అంతా భావించారు.
మరొవైపు ఖైదీ దుస్తులు ఇంకా సిద్ధం కాకపోవడంతో ప్రస్తుతం సల్మాన్ ఇంటి నుంచి తెచ్చుకున్న బట్టలనే జైలులో ధరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.