‘మీ పేపర్లు అమ్ముకునేందుకు సల్మాన్ ఖాన్ పై నెగిటివ్‌ కథనాలు రాయకండి’: కపిల్‌ శర్మ

వాస్తవం ప్రతినిధి: కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలి.. ప్రస్తుతం జోధ్‌పూర్ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బాలీవుడ్ నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. సల్మాన్‌ మంచితనం గురించి ప్రస్తావిస్తున్నారు. సల్మాన్ కు కఠినమైన శిక్ష విధించారని పేర్కొంటున్నారు. దీనిపై ప్రముఖ కమెడియన్‌ కపిల్‌ శర్మ ‘నేను ఎంతోమంది బడాబాబులను చూశాను. తాము సింహాలను వేటాడేవాళ్లమని వాళ్లు గర్వంగా చెప్పుకొనేవాళ్లను నేను కలిశాను. సల్మాన్‌ మంచి వ్యక్తి. ఆయన ఆ తప్పు చేశారో లేదో తెలియదు. కానీ ఆయనలోని మంచి కోణాన్ని చూడండి. చెత్త వ్యవస్థ. మంచి పనిచేయనివ్వదు’ అంటూ వివాదాస్పద వరుస ట్వీట్లు చేశాడు.

మీడియాను ఉద్దేశించి ‘మీ పేపర్లు అమ్ముకునేందుకు నెగిటివ్‌ కథనాలు రాయకండి. అతను మంచి వ్యక్తి. త్వరలోనే జైలునుంచి బయటకు వస్తాడు. ఎంతో పెద్ద పెద్ద ఘోరాలు జరిగినా మీరు మాట్లాడరు. నెగిటివ్‌ వార్తలు ప్రచారం చేసేందుకు ఎంతో తీసుకుంటారు’ అంటూ దుర్భాషలాడాడు. మళ్లీ ‘చెత్త వ్యవస్థ, చెత్త మనుషులు. నేనే ప్రధానమంత్రిని అయి ఉంటే.. ఫేక్ న్యూస్‌ సృష్టించేవారిని ఉరితీసి ఉండేవాడిని’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో వాటిని తొలగించిన కపిల్‌ శర్మ… తన అకౌంట్ హ్యాక్ అయిందని, వాటిని పట్టించుకోవద్దని తెలిపాడు. తరువాత ఆ ట్వీట్ ను కూడా తొలగించడం విశేషం.