భారీ ఆఫర్ ను తిరస్కరించిన కాజల్  

వాస్తవం సినిమా: తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా కాజల్  ప్రేక్షకుల మదిలో స్థానాన్ని ఏర్పరుచుకొంది. రెండు భాషల్లోని స్టార్ హీరోలతో ఆమె ఎన్నో సినిమాలు చేసింది .. మరెన్నో విజయాలను అందుకుంది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకి కోటి రూపాయల వరకూ పారితోషికం తీసుకుంటోంది. అలాంటి కాజల్ కి రెండు కోట్లు ఇస్తామంటూ రీసెంట్ గా ఒక బంపర్ ఆఫర్ వచ్చిందట. ప్రముఖ తమిళ దర్శకుడు పి.వాసు, కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ సినిమాలో టైటిల్ రోల్ కి కాజల్ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించిన ఆయన, రెండు కోట్లు ఆఫర్ చేశాడట. అనుష్క .. నయనతార మాదిరిగా కథా భారాన్ని పూర్తిగా మోసే పాత్రలను తాను ఇంతవరకూ చేయలేదనీ, ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని ఆ భారీ ఆఫర్ ను సున్నితంగా కాజల్ తిరస్కరించిందని సమాచారం. మరికొంతకాలం పాటు హీరోలతో కలిసి ఆడిపాడే పాత్రలను చేయడమే బెటర్ అని కాజల్ భావిస్తోందట.