పార్లమెంట్ ని రద్దు చేసిన ప్రధాని

వాస్తవం ప్రతినిధి: మలేసియా పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని నజీబ్‌ రజక్‌ శుక్రవారం ప్రకటించారు. తన ఐదేళ్ళ పదవీ కాలం ముగియడానికి ఇంకా రెండు నెలలు మిగిలి ఉండగానే కొత్తగా సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ ఆయన పార్లమెంట్ ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగా సార్వత్రిక ఎన్నికల కోసం ఆ దేశ ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కోట్లాది డాలర్ల కుంభకోణం కేసు ఎదుర్కొంటున్న నజీబ్‌, పాలక పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పార్లమెంట్‌ రద్దుకు రాజు ఆమోద ముద్ర పొందేందుకు గానూ సుల్తాన్‌ మహ్మద్‌ను కలిసినట్లు నజీబ్‌ చెప్పారు. శనివారం నుండి రద్దు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాజు సిఫార్సుచేసినట్లు నజీబ్‌ ఒక ప్రత్యేక ప్రకటనలో చెప్పారు. రద్దు చేసిన 60రోజుల్లోగా ఎన్నికలను నిర్వహించాల్సి వుంటుంది అన్నమాట. దీనితో మరో రెండు నెలల్లో మలేషియా లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.