నేటి నుంచి ఐపీఎల్ టీ-20 టోర్నీ

వాస్తవం ప్రతినిధి: క్రికెట్‌ వినోదానికి మారుపేరు ఐపీఎల్ టీ-20 టోర్నీ. బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంబించిన ఐపీఎల్ టీ-20 టోర్నీ మొదటి సీజన్ లోనే ఘనవిజయం సాధించింది. ఇక అప్పటి నుండి ప్రతి ఏటా ఈ టోర్నీకి ప్రేక్షకాధారణ పెరిగిపోతుంది. ఈ టోర్నీలో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు సైతం తహతహలాడుతుంటారు.. ఎందుకంటే పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది కనుక. ఏటా ఏప్రిల్ లో ప్రారంభమై మేలో ముగిసే ఈ క్రీడా వినోదం కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఐపీఎల్ సమయంలో సినిమా ధియేటర్లు, క్రీడా మైదానాలు, ఇతర వినోద కార్యక్రమాలు వెలవెలబోతాయి. ప్రపంచంలోనే ధనిక క్రీడా సంస్థల్లో ఒక్కటైన బీసీసీఐకి కాసులు కురిపించే క్రికెట్ పండగ నేడు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది.

ఆరంభ వేడుకలు 6:15 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. 7:30కు తొలి మ్యాచ్ కి టాస్ వేస్తారు. ఈ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ నటులు హృతిక్‌ రోషన్, వరుణ్‌ ధావన్‌, జాక్విలిన్ ఫెర్నాండెస్, తమన్నా భాటియాలతో పాటు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, సింగర్ మీకా సింగ్ ఆడిపాడనున్నాడు. అనంతరం తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో, రెండేళ్ల తరువాత పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. మ్యాచ్ లను స్టార్ ఇండియా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. వివిధ భాషల్లో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. హాట్ స్టార్, డీడీ స్పోర్ట్స్ లో ఐదు నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్ ప్రసారం కానుంది.