రావు రమేష్ కు మాతృ వియోగం

వాస్తవం సినిమా: ప్రముఖ సినీ నటుడు రావు రమేష్ తల్లి, దివంగత రావు గోపాలరావు భార్య కమలాకుమారి (73) ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. హైదరాబాద్ కొండాపూర్ లో ఉన్న తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, కమలాకుమారి మరణవార్త తెలిసిన వెంటనే… రావు రమేష్ నివాసానికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. రావు రమేష్ తోపాటు ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కమలాకుమారి హరికథా ప్రదర్శనలో దిట్ట. వివిధ రాష్ట్రాల్లో 5వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె ఓ స్టేజ్ షో ఇస్తున్నప్పుడు ఆమెను తొలిసారి చూశారు రావు గోపాలరావు. ఆ తర్వాత ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరి పెద్ద కుమారుడే రావు రమేష్.