సీనియర్‌ నటుడు, డబ్బింగ్‌ కళాకారుడు చంద్రమౌళి కన్నుమూత

వాస్తవం సినిమా: తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన సీనియర్‌ నటుడు, డబ్బింగ్‌ కళాకారుడు చంద్రమౌళి గురువారం కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 70 సంవత్సరాలు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మునగలపాలెంకు చెందిన చంద్రమౌళి 1971లో సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్లి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు సుమారు 200 సినిమాల్లో ఆయన నటించారు. కేవలం చిన్న చిన్న పాత్రలకే పరిమితమైనా చంద్రమౌళి ముఖం తెలుగు ప్రేక్షకులందిరికీ సుపరిచితమే. మరో ఆశ్చర్యకరమయిన విషయమేమిటంటే ప్రముఖ నటుడు మోహన్‌బాబు తండ్రి చంద్రమౌళికి గురువు. సుమారు 45 ఏళ్లకు పైబడిన తన సినీ ప్రస్థానంలో నటుడిగా, డబ్బింగ్‌ కళాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అంతా మన మంచికే’ అనే చిత్రంతో చంద్రమౌళి వెండి తెరకు పరిచయం అయ్యారు. రుతురాగాలు సీరియల్‌లో హీరోయిన్‌ తండ్రిపాత్రలో చంద్రమౌళి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అగ్రనటులందరి సినిమాల్లో కూడా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు.