లోక్‌సభ, రాజ్యసభ.. నిరవధిక వాయిదా!

వాస్తవం ప్రతినిధి: నేటితో పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. దాదాపు మూడు వారాలకు పైగా సాగిన సభలో కనీసం ఒక్కటంటే ఒక్క రోజైనా, కనీసం ఒక్క అంశంపైనైనా చర్చ సాగలేదు. ఎంపీల నిరసనల మధ్య తమకు కావాల్సిన కీలక బిల్లులను కేంద్రం ఆమోదింపజేసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టగా అవసలు చర్చకే రాలేదు. బడ్జెట్ సమావేశాల చివరిరోజైన ఈ రోజున కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో అదే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎంపీల ఆందోళనల మధ్యన సభా కార్యక్రమాలు సజావుగా జరగలేదు. లోక్‌సభ కేవలం పదిహేను నిమిషాల వ్యవధి మాత్రమే పని చేయగా, రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సభ్యుల నినాదాల మధ్యన లోక్‌సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. స్పీకర్ ప్రకటన అనంతరం, సభలో వందేమాతరం ఆలాపనతో సమావేశాలు ముగిసినట్టయ్యాయి. రాజ్యసభలోనూ దాదాపు ఇదే పరిస్థితి.