నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది మృతి

వాస్తవం ప్రతినిధి: నల్లగొండ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. పీఏ పల్లి మండలం వద్దిపట్ల వద్ద వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి ఏఎంఆర్‌ కాలువలోకి దూసుకెళ్లడంతో 9 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో మొత్తం 30 మంది ఉన్నట్లు సమాచారం. వివరాల ప్రకారం..వద్దిపట్లలోని పడమటి తండా నుంచి పులిచర్లలోని మిరపచేనులో పనులకు కూలీలు ట్రాక్టర్‌తో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల హాహాకారాలు విన్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో పోలీసులు 9 మృతదేహాలను వెలికితీశారు.కూలీల మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనాస్థలిలో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి మహేందర్ రెడ్డి ప్రమాదానికి కారణాలపై విచారణకు ఆదేశించారు,ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన ఐదుగురిని చికిత్స కోసం దేవ‌ర‌కొండ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాలువ‌లో ఉన్న ట్రాక్ట‌ర్ కింద మ‌రికొన్ని మృత‌దేహాలు ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముంద‌ని అధికారులు చెప్తున్నారు.