గొట్టం ని తుపాకీ గా భావించి కాల్పులు జరిపిన పోలీసులు

వాస్తవం ప్రతినిధి: నల్లజాతి యువకుడిని తుపాకితో బెదిరిస్తున్నాడని భావించిన అమెరికా పోలీసులు కాల్చి చంపిన ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. అమెరికా బ్రూక్లిన్‌లోని నల్లజాతీయులు అధికంగా ఉండే క్రౌన్‌ హైట్స్‌లో ఈ ఘటన సంభవించింది. దీనిపై స్థానికులు నిరసనకు దిగారు.  అక్కడి పోలీసుల వివరాల ప్రకారం ఒక యువకుడి చేతిలోని గొట్టంలాంటి వస్తువు తో ప్రజల పైకి గురి పెట్టి దుండగుడు బెదిరిస్తున్నాడని సమాచారం అందడం తో అక్కడకి చేరుకున్న పోలీసులు అతడి చేతిలోని గొట్టం ని తుపాకీగా భావించిన న్యూయార్క్‌ పోలీసులు అతడిపై కాల్పులు జరపటంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడిని నలుగురు పోలీసులు చుట్టుముట్టి పది రౌండ్లు కాల్పులు జరపగా అతను కుప్పకూలిపోయాడు. అతని చేతిలో తుపాకిలాగా ఒక లోహపు గొట్టం వుండటంతో పోలీసులు నివ్వెరపోయారు. వెంటనే అతడిని అస్పత్రికి తరలించినా ప్రాణాలను కాపాడలేకపోయారు. దీంతో అతను మృతి చెందాడని న్యూయార్క్‌ పోలీస్‌ విభాగాధిపతి తెలిపారు.  అయితే మృతిచెందిన వ్యక్తి కొంత కాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు.