అఖిలపక్ష మీటింగ్ వల్ల ఇప్పుడు ఏం లాభం? : పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి: ఏపీ విభజన హామీల అమలుపై వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తోన్న జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ శుక్రవారం నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. విజయవాడలోని బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు జాతీయ రహదారిపై కమ్యూనిస్టు నేతలతో కలిసి పవన్ పాదయాత్ర చేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వంపై పోరాడే క్రమంలో అఖిలపక్ష సమావేశం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నుంచి నిన్న తనకు, తన పార్టీకి మళ్లీ లెటర్ అందిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రెండు సంవత్సరాల క్రితం లేదంటే కనీసం ఒక ఏడాది క్రితం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బాగుండేదని అన్నారు. అఖిలపక్ష మీటింగ్ వల్ల ఇప్పుడు ఏం లాభమో తనకు అర్థం కావడం లేదని, వెళ్లి కాఫీ, టీలు తాగి రావడం తప్ప ఏం చేస్తామని ప్రశ్నించారు.

కాబట్టి ముందు చంద్రబాబు నాయుడు తమ మంత్రులతో కూర్చొని ప్రణాళిక వేసుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాయని, ఇక మున్ముందు పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళదామనుకుంటున్నారో చంద్రబాబు స్పష్టత తెచ్చుకోవాలని హితవు పలికారు. ఆ తరువాత వారి మనసులో ఏముందో తమకు తెలియజేస్తే, వారు పోరాడాలనుకుంటోన్న విధానంపై తాము యోచించి, వారితో కలిసి పోరాడతామా? లేదా? అనే విషయంపై తాము చెబుతామని అన్నారు. కాగా, తాము జేఎఫ్‌సీ నివేదిక రూపొందించిన కారణంగానే టీడీపీ, వైసీపీలపై ఒత్తిడి పెరిగిందని, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం వరకు దారి తీసిందని పవన్ చెప్పుకొచ్చారు.
నాయకులు అమ్ముడుపోతారేమో గానీ ప్రజలు, ప్రజానాయకులు అమ్ముడుపోరని అన్నారు. ప్రత్యేక హోదా కోసం అందరితో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. విభజన సమయంలో ఆస్తులను తెలంగాణకు, అప్పులను ఆంధ్రాకు ఇచ్చారని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ‘ప్రత్యేక హోదాపై కేంద్రం మాటమార్చిందని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది.. అన్ని రాష్ట్రాలకు ఇచ్చే నిధులనే పేరు మార్చి ప్యాకేజీ అన్నారు.. విభజన హామీలు కేంద్రం అమలు చేస్తుందని కొన్ని రోజులు వేచిచూశాం’ అని పవన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయంపై తిరుపతిలో జరిగిన పార్టీ సభలో తొలిసారిగా తానే మాట్లాడానని, ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలని చెప్పానని, అయినప్పటికీ ఆ పాచిపోయిన లడ్డూలే కావాలని చంద్రబాబు అన్నారని పవన్ వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సమర్థవంతమైన పాత్ర నిర్వహించలేకపోయిందని, వామపక్ష పార్టీలతో కలిసి జనసేన పోరాడుతోందని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.