పూర్తి అయిన మిడ్‌మానేరు ప్రాజెక్టు

వాస్తవం ప్రతినిధి: తెలంగాణా లోని మిడ్‌మానేరు ప్రాజెక్టు గేట్ల బిగింపు సహా అన్ని సివిల్, మెకానికల్, సాంకేతిక పనులు పూర్తి అయినట్లు తెలుస్తుంది. 2006 లో కాంగ్రెస్ హయంలో  ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కేసీఆర్ సర్కార్ హయం లో  పూర్తి అయింది. పదేళ్ళ లో కేవలం 50 శాతం మాత్రమే పూర్తయితే.. మిగతా 50శాతం పనులు కేవలం 10 నెలల్లోనే పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం రికార్డు తిరగరాసింది. శ్రీరాంసాగర్‌కు అత్యంత కీలకమైన ప్రాజెక్టు ఈ మిడ్‌మానేరు. మిడ్‌మానేరు ప్రాజెక్టుకు 25గేట్ల బిగింపు పూర్తయింది. దీంతో 25 టీఎంసీల నీటి నిల్వకు ప్రాజెక్టు సిద్ధమవ్వగా, డ్యాంపై స్పిల్‌వే బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తయింది. మొత్తం రూ.2,150 కోట్ల ఖర్చుతో 10 నెలల్లోనే 50 శాతం పనులు పూర్తిచేశారు. ప్రాజెక్టు పూర్తి కావడం పట్ల తెలంగాణా మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేసారు.