పుతిన్ ని ఆహ్వానించిన ట్రంప్

వాస్తవం ప్రతినిధి: ఇటీవల అమెరికా,రష్యా ల మధ్య చోటుచేసుకున్న పరిణామాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్నట్లు అయిన సంగతి తెలిసిందే. అయితే ఇరు దేశాల మధ్య కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైట్‌హౌస్‌కు రావాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఈ ఆహ్వానాన్ని ఇరు వర్గాలు కూడా ధృవీకరించారు. ఇరువురు అధ్యక్షులు టెలిఫోన్ లో మాట్లాడుకున్న సందర్భంగా వైట్ హౌస్ కి రావలసిందిగా కోరినట్లు తెలుస్తుంది. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు తమ దౌత్యవేత్తలను బహిష్కరించిన నేపథ్యంలో ముందుకు సాగడానికి తాము ప్రయత్నిస్తున్నామని రష్యా పేర్కొంటూ ఈ ఆహ్వానం విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ సమావేశం ఎక్కడ ఎప్పుడు అన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే టెలిఫోన్ లో మాత్రం తోలి సమావేశం వాషింగ్టన్ లో జరిగితే బాగుంటుంది అనే అభిప్రాయం ట్రంప్ వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీనితో మొదటి సమావేశం వాషింగ్టన్ లో జరుగుతుందా లేదా ఒకవేళ జరిగితే ఆ తేదీలు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.