నిందా రాజకీయాలు మాకు అలవాటు లేదు: జవదేకర్

వాస్తవం ప్రతినిధి: ఏపీ కి ప్రత్యేక హోదా అంశంపై ఎన్డీయే సర్కార్ నుంచి టీడీపీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇరు పార్టీల నేతలు ఒకరిపైనొకరు ప్రత్యారోపణ లకు దిగుతున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు పై బీజేపీ కూడా తనదైన శైలి లో విమర్శలు చేసింది. స్నేహం చేసిన వారిని వంచించే అలవాటు బీజేపీకి లేదని చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు. బుధవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుతో కలిసి విలేకరుల సమావేశం  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ…..నాలుగేళ్లు మా భాగస్వామిగా ఉండి ఇప్పుడు నిందా రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ స్నేహితులను చేసుకుంటుంది తప్పితే వంచించే అలవాటు లేదు. మేం స్నేహానికి విలువ ఇస్తాం.. ప్రజలను గౌరవిస్తాం.. అభివృద్ధికి విలువ ఇస్తాం.. విభజన చట్టంలో ఉన్న వాటితో పాటు లేనివీ కూడా మేం చేసిన తీరు నరేంద్ర మోదీ మహత్తుకు అద్దంపడుతుంది అని ఆయన అన్నారు.