అఫ్రిది వ్యాఖ్యలపై స్పందించిన పలువురు భారత క్రికెటర్లు

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్‌ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది కాశ్మీర్ అంశంపై మాట్లాడుతూ భారత్ ని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అఫ్రిది వ్యాఖ్యలతో పలువురు భారత క్రికెటర్లు స్పందించారు. అఫ్రిది వ్యాఖ్యలు చేసిన వెంటనే గంభీర్ స్పందిస్తూ నోబాల్ వేసి సంబారాలు చేసుకుంటున్నాడు అని అన్నాడు. అలానే యూఎన్ అంటే అఫ్రిది దృష్టిలో అండర్ నైంటీన్ అని అలాంటి వ్యాఖ్యలపై నేను స్పందించడం కరెక్ట్ కాదు అంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు తాజాగా విరాట్‌ కోహ్లీ, సురేశ్‌ రైనాతో పాటు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కూడా స్పందించారు. అసలు అఫ్రిది మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని కపిల్‌ దేవ్‌ అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలకు ఎంతమాత్రం మద్దతు ఇవ్వబోనని దేశానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని కోహ్లీ వెల్లడించారు. దీనిపై ట్విటర్‌లో ట్వీట్లు చేశారు. ఒక భారతీయుడిగా నా దేశానికి ఏది ఉత్తమమైనదో దాన్నే వ్యక్తపరచాలి. నా ఆలోచనలు ఎప్పుడూ దేశ ప్రయోజనం కోసమే ఉంటాయి. దేశానికి వ్యతిరేకంగా ఉన్న వాటికి నేను ఎన్నటికీ మద్దతు ఇవ్వబోను. నా మొదటి ప్రాధాన్యత దేశానికే ఇస్తానుఅని కోహ్లీ పేర్కొన్నారు. ఇక దీనిపై స్పందించిన కపిల్‌ దేవ్‌.. అసలు అతడు ఎవరు? అతనికి మనం ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి? ఇటువంటి వాళ్లకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతమాత్రం లేదుఅని అన్నారు. కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగమే. కశ్మీర్‌ నా పూర్వీకులు జన్మించిన పవిత్ర భూమి. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నియంత్రించేలా అఫ్రిది భాయ్‌ పాకిస్థాన్‌ ఆర్మీని అడగాలి. మేము ఎప్పుడూ శాంతినే కోరుకుంటాం. రక్తపాతాన్ని, ఆందోళనలను ఎంతమాత్రం అంగీకరించబోము అని అంటూ రైనా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.